ఈ ఫొటోలో మీరు చూస్తున్న స్తంభం లాంటి దుంప పేరు 'భూచక్రగడ్డ'. దీన్నే 'మాగడ్డ' అని కూడా పిలుస్తారు. కేవలం నల్లమల అటవీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీశైలం నుంచి అటు గిద్దలూరు వరకూ మాత్రమే దొరుకుతుంది. భూచక్రగడ్డకీ, చెంచులకూ అవినాభావ సంబంధం. చిన్నప్పటినుంచీ నెలకొక్కసారన్నా ఎక్కడో ఒకచోట తింటూనే వున్నా ఎప్పటికప్పుడు కొత్త రుచి అనిపిస్తూనేవుంటుంది.
భూచక్రగడ్డ సేకరణ చుట్టూ అనేక నమ్మకాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచక్రగడ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గడ్డ దొరికితే కుటుంబమంతా కనీసం నెలరోజులు బతికే ఆదాయాన్నిస్తుంది కాబట్టి దీనిని లక్ష్మిగడ్డ అని, లచ్చిగడ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని లచ్చిగడ్డ అని మాత్రమే పిలుస్తారు. నరసింహస్వామిని ఆరాధించే చెంచులు భూచక్రగడ్డను నరసింహస్వామి ప్రసాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీనిని గడ్డప్రసాదమని చెప్తుంటారు.
భూచక్రగడ్డ ... మీటరు నుంచి 20 మీటర్ల పొడవు దాకా భూమిలో పది, పన్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచక్రగడ్డ దొరికే అవకాశం వుండే ప్రాంతాల్లో ఒకవిధమైన మత్తులాంటి వాసన వస్తుందట. చెంచులు ఆ వాసనను పసిగట్టే, గడ్డ కోసం శోధన మొదలుపెడతారట. గడ్డ ఒకచోట దొరుకుతుందని రూఢిగా తెలిశాక, సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన తర్వాత తవ్వడం మొదలుపెడతారు. దొరికిన గడ్డను ఆ పనిలో భాగం పంచుకున్నవాళ్ళందరూ సమానంగా పంచుకుంటారు. గడ్డ మొదలు, చివర్లలో అడుగు మోయిన కత్తిరించి, ఎక్కడో ఒకచోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొలకెత్తదు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.
భూచక్రగడ్డ మీకు ఎక్కడ కనిపించినా నిస్సందేహంగా నాలుగు ముక్కలు తినేయండి. అంచులు బాగా పదునుగా వున్న కొడవలితో సన్నటి లేయర్ కట్ చేస్తారు. ఎంత సన్నటి లేయర్ వుంటే అంత ఎక్కువ రుచి వుంటుంది. తీపిగా వుండదని పంచదార చల్లి అమ్ముతుంటారు. కానీ పంచదార లేకుండా తినడమే మంచిది. శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు భూచక్రగడ్డ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రక్తవిరోచనాలు, కడుపులోపల పడే పుండ్లను మాన్పుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు, దీనివల్ల మరో మహోపయోగం వుంది. తాజాగా తీసిన ముక్కను చాలా కొద్దిగా పాలు, తేనెతో కలిపి మిక్సీలో వేస్తే వచ్చే పాలు పసిపిల్లలకు పడతారు. పాలు ఇవ్వలేని తల్లులు ఈ 'గడ్డపాలు' దొరుకుతాయేమోనని ఆరా తీయడం నేను చాలాసార్లు విన్నాను.
గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళేప్పుడు పచ్చర్ల అనే చిన్న గ్రామం వస్తుంది. ఆ వూరి దగ్గర రోడ్డు మీద తరచూ ఈ దుంపలు కనిపిస్తుంటాయి. అయితే, భూచక్రగడ్డను పూర్తిగా ఎవరికీ అమ్మరు. ముక్కలుగా మాత్రమే అమ్ముతారు. ఇప్పుడైతే హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో మారుబేరం వ్యాపారులు అమ్ముతున్నారు కానీ, ఇవ్వాళ్టికీ గిద్దలూరు, నంద్యాల, కర్నూలు, శ్రీశైలం, అహోబిలం (ఓబులం) ప్రాంతాల్లో చెంచులే అమ్ముతుంటారు. ఈసారి మీరు భూచక్రగడ్డను చూసినప్పుడు దానిచుట్టూ మొలతాడు దారంతో చుట్టిన నరసింహస్వామి బొమ్మ వుందేమో గమనించండి. ఉంటే అతను నిజమైన చెంచు అన్నట్లే.
No comments:
Post a Comment