హైందవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహాశివుడే అగ్రదేవుడుగా పూజలందుకుంటున్నారు. ఆ పరమేశ్వరునికి భారతదేశంలో ఉన్న గొప్ప దేవాలయాలలో కర్నూలు జిల్లాలోని “యాగంటి” దేవాలయం కూడా ఒకటి. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దేవుడే ఏదో ఒక అద్భుత సంఘటనతో తెలియజేస్తాడు.. అలాంటి సంఘటనలు అద్భుతాలు ఈ యాగంటిలో అనేకం. కర్నూలు జిల్లా కేంద్రం నుండి 100కిలో మీటర్ల దూరంలో యాగంటి దేవాలయం ఉంది. ఇక్కడ శివుడు శ్రీ ఉమామహేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. పొడవాటి గుహలు, దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్యలో ఈ గుడి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. దేవాలయం మాత్రమే కాదు అక్కడికి చేరుకునే మార్గం కూడా సుందర పచ్చని ప్రకృతితో చాలా అందంగా ఉంటుంది భక్తులకు ఆ దారి కూడా మరింత ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని ఇక్కడి చరిత్ర వివరిస్తుంది కాని దీనిని హరిహర రాయలు, బుక్కరాయలు మరింత పటిష్టంగా నిర్మించారు.
గుడికి ఈశాన్యంలో నందీశ్వర మండపం ఉంటుంది.. ఇక్కడి నంది స్వయంగా శివుడి ఆజ్ఞతో స్వయంగా వెలిశాడు. మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన భవిష్యవాణిలో యాగంటి బసవన్న ప్రస్థావన తీసుకొచ్చారు.. కలియుగంలో విగ్రహం పెరుగుతూ కలియుగాంతమున విగ్రహం నందిగా మారి గంతులేస్తాడని వీరబ్రహ్మేంద్ర స్వామి పూర్వం వివరించారు… అందుకు తగ్గట్టుగానే ఇక్కడి విగ్రహం ఎత్తు బరువు పెరుగుతున్నది. ప్రస్తుతం విగ్రహం 15అడుగుల పొడవు, 10అడుగుల వెడల్పు, 8అడుగుల ఎత్తు ఉంది. పూర్వం అగస్య మహాముని యాగంటిని సందర్శించి ఇక్కడి వాతావరణానికి పరవశించి వైష్ణవ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో వేంకటేశ్వర స్వామి విగ్రహా కాలి బొటనవేలు విరిగిపోయింది… అందుకు వేంకటేశ్వరుడిని వేరొక చోట ప్రతిష్టించారు.. అగస్యముని కోరిక మేరకు ఇక్కడ శివపార్వతులు ఏకశిలలో(ఒకే విగ్రహంలో) కనిపిస్తారు.
ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత శని వాహనం ఐన కాకులు ఈ దేవాలయంలోనికి లోనికి రావు… అందువల్ల ఇక్కడి శివడి దర్శనంతో శనిబాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి, మార్కండేయలింగేశ్వర స్వామి, విశ్వనాధేశ్వర స్వామి, వేంకటేశ్వర స్వామి ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడి అగస్య పుష్కరిని అత్యంత పవిత్రమైనదిగా పరిగనిస్తారు. ఈ పుష్కరిని లోని నీరు రాళ్ళ మధ్య నుండి అదృశ్యంగా వస్తుంది, శివుని అభిషేకాల కోసం ఇందులోని మంచినీటినే ఉపయోగిస్తారు . దేవాలయానికి పక్కనే ఉన్న కొండలలో అగస్య గృహ ఉంటుంది.. అత్యంత పూర్వంనాటి ఈ గృహలోనే భృంగిఋషి,అగస్య మహర్షి లాంటి ఎందరో గొప్ప మహానుభావులు తపస్సులు చేసేవారట. ఇక్కడే సమీపంలో వెంకటేశ్వరుని గృహ కూడా అద్భుతంగా ఉంటుంది, ఈ గృహలో వేంకటేశ్వర స్వామి పూజలందుకుంటున్నారు.. భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీటిలోను పరమేశ్వరుడు లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తారు, కాని ఇక్కడ యాగంటిలో మాత్రం శిలాకృతిలో దర్శనమిస్తారు.
No comments:
Post a Comment